Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐటీ రారాజు బెంగళూరు.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ నగరాల జాబితాలో ఫస్ట్​!

Bengaluru worlds fastest growing tech hub
  • నాలుగేళ్లలో 5.4 రెట్లు పెరిగిన పెట్టుబడులు
  • రూ.9,494 కోట్ల నుంచి రూ.52,590 కోట్లకు
  • 1.7 రెట్ల వృద్ధితో ఆరో స్థానంలో ముంబై
  • 3 రెట్ల వృద్ధితో లండన్ కు రెండో ర్యాంకు
  • లండన్ అండ్ పార్ట్ నర్స్, డీల్ రూం నివేదిక
బెంగళూరు.. భారత్ సిలికాన్ వ్యాలీ అనీ ఆ సిటీని పిలుస్తుంటాం. ఆ పేరుకు తగ్గట్టే ప్రపంచ ఐటీ రేసులో దూసుకుపోతోంది కన్నడ మహా నగరం. ఎంతలా అంటే ఐటీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధిని నమోదు చేస్తున్న నగరాల్లో ప్రపంచంలోనే బెంగళూరు మొదటి స్థానాన్ని సంపాదించింది. మహామహా నగరాలను తోసిరాజని రారాజుగా నిలిచింది. ప్రపంచ ఐటీ నగరాల అభివృద్ధిపై లండన్ అండ్ పార్ట్ నర్స్– ద మేయర్ ఆఫ్ లండన్, డీల్ రూమ్ అనే సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో బెంగళూరుకు ప్రథమ స్థానాన్ని ఇచ్చాయి.

2016 నుంచి 2020 వరకు (నాలుగేళ్లలో) బెంగళూరులో ఐటీ పెట్టుబడులు 5.4 రెట్లు పెరిగాయని నివేదిక పేర్కొంది. 2016లో 130 కోట్ల డాలర్లు(సుమారు రూ.9,494 కోట్లు)గా ఉన్న పెట్టుబడులు 2020 నాటికి 720 కోట్ల డాలర్లకు (సుమారు రూ.52,590 కోట్లు) పెరిగింది. ఈ జాబితాలో దేశ ఆర్థిక రాజధాని ముంబై ఆరో స్థానాన్ని సంపాదించింది. నాలుగేళ్లలో 1.7 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. 70 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,112 కోట్లు) నుంచి 120 కోట్ల డాలర్లకు (సుమారు రూ.8,764 కోట్లు) పెట్టుబడులు పెరిగాయి.

ఇక, జాబితాలో లండన్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. 2016 నుంచి 2020 వరకు మూడు రెట్ల వృద్ధిని నమోదు చేసింది. పెట్టుబడులు 350 కోట్ల డాలర్ల (సుమారు రూ.25,564 కోట్లు) నుంచి 1,050 కోట్ల డాలర్లకు (సుమారు రూ.76,692 కోట్లు) పెరిగాయి. దాంతో పాటు జర్మనీలోని మ్యూనిక్, బెర్లిన్ నగరాలు, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లలో పెట్టుబడులు రెట్టింపయ్యాయి. జాబితాలో అవి టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాయి.

కాగా, వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడుల్లోనూ బెంగళూరు టాప్ టెన్ లో నిలిచింది. ఆరో ర్యాంకును దక్కించుకుంది. ఈ జాబితాలో బీజింగ్, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షాంఘై, లండన్ లు బెంగళూరు కన్నా ముందున్నాయి. ముంబైకి 21వ స్థానం లభించింది. అయితే, నివేదికలో ఎక్కడా హైదరాబాద్ ప్రస్తావన రాలేదు.
Bengaluru
Mumbai
London
IT Hub

More Telugu News